Vishnu Vardhan Reddy: ఆక్సిజన్ లేక కదిరి ఆసుపత్రిలో జనాలు చనిపోతున్నారు: జగన్ కు విష్ణువర్ధన్ రెడ్డి లేఖ
- రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది మరణిస్తున్నారు
- ఆసుపత్రుల్లో ఒకే మంచంపై ఇద్దరు రోగులు ఉంటున్నారు
- బెడ్ల సంఖ్యను వెంటనే పెంచాలి
రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా లేక వందలాది మంది మరణిస్తున్నారని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. అనంతపురం జిల్లా కదిరి ఆసుపత్రిలో అవసరమైన ఆక్సిజన్ లేక కొందరు చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ను సరఫరా చేసి అమాయకుల ప్రాణాలకు కాపాడాలని కోరారు.
చాలా ఆసుపత్రుల్లో మంచాలు లేక ఒకే మంచంపై ఇద్దరు చొప్పున రోగులు ఉంటున్నారని చెప్పారు. కొందరు రోగులను నేలమీద చాపలపై పడుకోబెడుతున్నారని విమర్శించారు. ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను వెంటనే పెంచాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచేలా చర్యలను చేపట్టాలని విష్ణు డిమాండ్ చేశారు. కరోనా విస్తరణ, ఉద్ధృతిని ముందస్తుగా అధికారులు అంచనా వేయకపోవడం వల్లే ఈ దారుణ పరిస్థితి తలెత్తిందని దుయ్యబట్టారు.