Corona Virus: పటిష్ఠ చర్యలు చేపడితే కరోనా థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవచ్చు!: ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు
- కరోనా థర్డ్ వేవ్ తప్పదని ఇటీవల హెచ్చరిక
- ఎప్పుడు సంభవిస్తుందో తెలియదని వ్యాఖ్య
- తాజాగా ఊరట కలిగించే అంశం
- ప్రతిస్థాయిలో పకడ్బందీగా కరోనా కట్టడి చర్యలు అమలు చేయాలని సూచన
భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ అనివార్యమంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు విజయ్ రాఘవన్ చేదు నిజం చెప్పిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయనే మరో ఊరట కలిగించే విషయం వెల్లడించారు. కఠిన చర్యలు తీసుకుంటే థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు.
‘‘పటిష్ఠ చర్యలు చేపడితే కొన్ని ప్రాంతాల్లో వీలైతే అన్ని ప్రాంతాల్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉండదు. అయితే, నగరాలు, జిల్లాలు, రాష్ట్రాలు ఇలా ప్రతి స్థాయిలో కరోనా కట్టడి నిబంధనల్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తారన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది’’ అని విజయ్ రాఘవన్ తెలిపారు.
దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రత కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, వ్యాప్తి ఇలాగే కొనసాగితే వైరస్ పరిణామ క్రమం చెంది థర్డ్ వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉందని రాఘవన్ బుధవారం జరిగిన ప్రెస్ మీట్‌లో హెచ్చరించారు. అయితే, అది ఎప్పుడు సంభవిస్తుందో మాత్రం చెప్పలేమన్నారు. తాజాగా కఠిన నియమాలు పాటిస్తే థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవచ్చన్నారు.