Chandrababu: చంద్రబాబుపై తప్పుడు కేసు అందుకే: టీడీపీ ధ్వజం
- వైరస్‌పై అపోహలు ప్రచారం చేస్తున్నారంటూ కేసు
- చంద్రబాబుపై కేసు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్న టీడీపీ
- అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకేనని ఆగ్రహం
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై కేసు పెట్టడాన్ని టీడీపీ దుయ్యబట్టింది. కరోనా నియంత్రణలో విఫలమైన జగన్ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌పై చంద్రబాబునాయుడు లేనిపోని అపోహలు ప్రచారం చేస్తున్నారంటూ న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదుపై కర్నూలులో నిన్న కేసు నమోదైంది.
దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ.. ఎన్440కె వైరస్‌పై మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావించి అప్రమత్తం చేస్తే తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. చంద్రబాబుపై కేసు నమోదు కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని, సాధారణ పౌరులు కూడా కరోనాపై తమ గళాన్ని స్వేచ్ఛగా వినిపించొచ్చని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని వెంకట్రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కర్నూలులో ఎన్ 440కె రకం వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి ఫొటోతో సహా మీడియాలో కథనాలు వచ్చాయని, ప్రమాద తీవ్రతపై సీసీఎంబీ కూడా తన నివేదికల్లో హెచ్చరించిందని అన్నారు. మరి వారిపై కేసులు పెడతారా? అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.