Corona Virus: కరోనా వ్యాక్సిన్ కోసం ఆత్రం.. మదనపల్లె పీహెచ్సీకి వందలాది మంది!
- రామారావు కాలనీలో ఉద్రిక్తత
- కొవిడ్ నిబంధనలు పాటించకుండా క్యూ
- అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులు
కరోనా వ్యాక్సిన్ కొరత ఉన్న నేపథ్యంలో ప్రజలు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చోవాల్సి వస్తోంది. ఇప్పటికే మొదటి డోసు తీసుకున్న వారు తమకు రెండో డోసు దొరుకుతుందా? లేదా? అన్న ఆందోళనలో ఉన్నారు. దీంతో చిత్తూరు జిల్లా మదనపల్లెలోని రామారావు కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రెండో డోసు కరోనా కోసం వందలాది మంది తరలివచ్చారు.
అక్కడ కొవిడ్ నిబంధనలు పాటించకుండా నిలబడ్డారు. దీంతో కరోనా వ్యాప్తి ముప్పు పొంచి ఉంది. ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కొవాగ్జిన్ డోసులు తక్కువగా వచ్చాయి. జనాలు మాత్రం భారీగా చేరుకున్నారు. రెండో డోసు కోసం గత కొన్ని రోజులుగా వేచి ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు వచ్చారు.