Nirmala Sitharaman: ధరల్ని నియంత్రించడానికే వ్యాక్సిన్లు, ఔషధాలపై జీఎస్టీ: నిర్మలా సీతారామన్
- మమతా బెనర్జీ లేఖపై స్పందించిన ఆర్థిక మంత్రి
- చాలా వరకు కొవిడ్ వైద్య పరికరాలపై పన్ను మినహాయించామని వివరణ
- కొన్నింటిపై ఐజీఎస్టీని రద్దు చేసినట్లు వెల్లడి
- కొన్ని వర్గాలకు ఉచితంగానే టీకా ఇస్తున్నామన్న మంత్రి
కరోనా నేపథ్యంలో అవసరమైన వైద్య పరికరాలు, ఔషధాలు సహా ఇతర వైద్య సరఫరాలకు పన్నుల నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి రాసిన లేఖపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. వాస్తవానికి వ్యాక్సిన్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఔషధాల ధరల్ని నియంత్రించడానికే వీటిపై పన్నులు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఒకవేళ వీటికి జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపునిస్తే వాటి తయారీదారులకు ముడి పదార్థాలపై చెల్లించే పన్నులు భారంగా మారతాయని తెలిపారు. దీంతో వారు ఆ భారాన్ని ధరలు పెంచి వినియోగదారులపై మోపే అవకాశం ఉందన్నారు. తద్వారా సామాన్యుడు చెల్లించాల్సిన ధరలు పెరుగుతాయని వివరించారు.
ఇక చాలా కొవిడ్ సంబంధిత వైద్య సామగ్రిపై ఇప్పటికే ఐజీఎస్టీ, కస్టమ్స్ సుంకం రద్దు చేసినట్లు గుర్తుచేశారు. రెమ్‌డెసివిర్ ఔషధానికి అన్ని రకాల సుంకాల నుంచి మినహాయింపు కల్పించామన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా, నిల్వకు సంబంధించిన యంత్రాలు, పరికరాలపైనా సుంకం నుంచి మినహాయింపు ఉందని పేర్కొన్నారు. 45 ఏళ్ల పైబడిన వారితో పాటు కరోనా యోధులకు కేంద్రమే టీకాలు ఉచితంగా ఇస్తోందని గుర్తుచేశారు. వాటికి సంబంధించిన జీఎస్టీని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు.