Pfizer: ఆస్ట్రాజెనెకాతో యూరోపియన్ యూనియన్ కటీఫ్.. ‘ఫైజర్’ వైపు మొగ్గు
- ఒప్పందం మేరకు టీకాలను సరఫరా చేయలేకపోతున్న ఆస్ట్రాజెనెకా
- కాంట్రాక్ట్ పునరుద్ధరించకూడదని ఈయూ నిర్ణయం
- ఫైజర్‌తో భారీ ఒప్పందం
కరోనా టీకాలను సరఫరా చేస్తామంటూ యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయడంలో ఆస్ట్రాజెనెకా విఫలమైంది. చేసుకున్న ఒప్పందం మేరకు టీకాలను సరఫరా చేయలేకపోతోంది. దీంతో ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్న యూరోపియన్ యూనియన్ ఆస్ట్రాజెనెకాపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది.
ఈ క్రమంలో తాజాగా, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందం జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో దానిని ఇక పునరుద్ధరించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు యూరోపియన్ ఇంటర్నల్ మార్కెట్ కమిషనర్ తెలిపారు.
కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేయాలని అనుకోవడం లేదని, తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్నారు. 2023 నాటికి 1.8 బిలియన్ మోతాదుల కోసం భారీ కాంట్రాక్ట్ పొడిగింపునకు అంగీకరించడం ద్వారా ఫైజర్-బయోఎన్‌టెక్ టీకాకు మద్దతు ఇచ్చిన తర్వాతి రోజే ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఆస్ట్రాజెనెకాకు బదులుగా ఫైజర్ వ్యాక్సిన్‌ను తెప్పించుకుంటామని పేర్కొంది. ఆస్ట్రాజెనెకాతో పోలిస్తే ఫైజర్ వ్యాక్సిన్ ధర తక్కువని ఈయూ స్పష్టం చేసింది.