KCR: కేసీఆర్ కు ఫోన్ చేసి అభినందించిన మోదీ!

PM Modi telephones KCR

  • కరోనా కట్టడిపై కేంద్ర ఆరోగ్యమంత్రికి కేసీఆర్ సూచనలు
  • మోదీ దృష్టికి తీసుకెళ్లిన ఆరోగ్య మంత్రి
  • మీ సూచనలను ఆచరణలో పెడతామన్న మోదీ

మీరు చేసిన సూచనలు చాలా బాగున్నాయంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రధాని మోదీ ప్రశంసించారు. నిన్న రాత్రి కేసీఆర్ కు ప్రధాని స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కు కేసీఆర్ ఫోన్ చేసి కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు సూచనలు చేశారు. కోవిడ్ వ్యాప్తికి కారకులవుతున్న వారిని గుర్తించి, ముందుగా వారికి వ్యాక్సిన్ వేయాలని సూచించారు.

క్యాబ్, ఆటో డ్రైవర్లు, గ్యాస్ డెలివరీ బాయ్ లు, కండక్టర్లు, వీధి వ్యాపారులు, వివిధ ప్రాంతాల్లో పని చేసే కార్మికులకు తక్షణమే వ్యాక్సిన్లు వేసేందుకు నిబంధనలను సడలించాలని చెప్పారు. ఈ వెసులుబాటును రాష్ట్రాలకు కల్పిస్తే, కరోనా వ్యాప్తిని ఎక్కువ మేర అరికట్టవచ్చని తెలిపారు. కేసీఆర్ సూచనపై కేంద్ర ఆరోగ్యమంత్రి స్పందిస్తూ... మీ సలహాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

కరోనాపై తన సమీక్ష తర్వాత నిన్న రాత్రి కేసీఆర్ కు మోదీ ఫోన్ చేశారు. మీది మంచి ఆలోచన అని, మీరిచ్చిన సలహాలు బాగున్నాయని, వాటిని ఆచరణలో పెడతామని చెప్పారు. కేసీఆర్ సూచనలకు అభినందనలు తెలియజేశారు. అంతేకాదు తెలంగాణకు మరింతగా ఆక్సిజన్, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లను సరఫరా చేయాలన్న కేసీఆర్ విన్నపానికి స్పందిస్తూ... దీనికి సంబంధించి వెంటనే చర్యలను చేపడతామని అన్నారు. 

  • Loading...

More Telugu News