Putta Madhu: పుట్ట మ‌ధును మూడోరోజూ విచారించ‌నున్న పోలీసులు.. కీల‌క విష‌యాల వెల్ల‌డి

 Putta Madhu case Updates

  • గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో విచార‌ణ
  • నేడు పుట్ట మ‌ధు భార్య శైల‌జ‌నూ విచారించ‌నున్న పోలీసులు
  • మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ స‌త్య‌నారాయ‌ణ‌ను కూడా
  • పుట్ట మ‌ధు పాత్ర ఎంత‌? అనే విష‌యంపై సాయంత్రంలోగా స్ప‌ష్ట‌త‌

న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో విచార‌ణ కొన‌సాగుతోంది. అదృశ్య‌మైన  పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌  పుట్ట మధును ఎట్ట‌కేలకు పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఇప్ప‌టికే పోలీసులు బలమైన ఆధారాలు సేక‌రించారు.

వామ‌న‌రావు దంప‌తుల దారుణ హ‌త్య జ‌రిగిన‌ప్ప‌టి నుంచి పుట్ట మధు పేరు ఈ కేసులో బలంగా వినిపిస్తోంది. దీంతో మూడో రోజు కూడా పుట్ట మ‌ధును రామ‌గుండం పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, నేడు మ‌ధు భార్య శైల‌జ‌తో పాటు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ స‌త్య‌నారాయ‌ణ‌ను కూడా పోలీసులు విచారించ‌నున్నారు.  

బిట్టు శ్రీనుతో వీడియో కాల్‌ చేయించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలపై పుట్ట శైలజపై కూడా కేసు నమోదైన విష‌యం తెలిసిందే. ఈ కేసులో మ‌ధు పాత్ర ఎంత‌? అనే విష‌యంపై పోలీసులు విచార‌ణ జ‌రుపుతూ  మరిన్ని ఆధారాలు సేక‌రిస్తున్నారు.   ఆయనతో పాటు పుట్ట శైలజ, సత్యనారాయణ విచారణలో ఏం చెబుతారన్న విష‌యంపై ఉత్కంఠ నెల‌కొంది. పోలీసులు పలు సాంకేతిక ఆధారాలనూ సేక‌రించారు.

మ‌ధును, ఆయ‌న భార్య శైలజను వేర్వేరు గ‌దుల్లో విచారించ‌నున్నారు. లాయ‌ర్ల హ‌త్య‌కు పుట్ట కుటుంబంలో ఎవ‌రు స‌హ‌క‌రించార‌న్న విష‌యంపై పోలీసులు ఆరా తీయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రంలోపు ఈ విష‌యంలో విచార‌ణ పూర్తై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉన్న‌ట్లు స‌మాచారం.

వారి బ్యాంకు ఖాతాలు, ఇత‌ర వ్య‌వ‌హారాల‌పై కూడా పోలీసులు ఆరా తీసిన‌ట్లు తెలిసింది. అలాగే, రాయ‌చూర్, ఢిల్లీకి చెందిన ఇద్ద‌రు అనుమానిత‌ వ్యాపారుల బ్యాంకు ఖాతాల‌పై కూడా పోలీసులు దృష్టి పెట్టిన‌ట్లు స‌మాచారం. హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో కుంట శ్రీను, పుట్ట‌ మ‌ధు క‌లిశారా? అన్న విష‌యంపై కూడా నేటి సాయంత్రంలోపు స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ కేసులో ఇప్ప‌టికే కీల‌క విష‌యాలు వెల్ల‌డైన‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News