Congress: కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలకు తేదీ ఖరారు చేసిన సీడబ్ల్యూసీ
- జూన్ 23న నిర్వహించాలని నిర్ణయం
- 2019 నుంచి ఖాళీగా ఉన్న స్థానం
- ఎన్నికల్లో ఘోర వైఫల్యంతో తప్పుకొన్న రాహుల్
- తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంది. జూన్ 23న ఎన్నికలు నిర్వహించనున్నట్టు పార్టీ నేత ఒకరు చెప్పారు. ఎన్నిక ద్వారానే పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంది. బాధ్యతలు చేపట్టాల్సిందిగా రాహుల్ ను పార్టీ నేతలు పలుమార్లు బతిమాలినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది.
అప్పట్నుంచి ఆమే అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే, రెండేళ్ల ఈ సందిగ్ధానికి ఇప్పుడైనా తెరపడుతుందా? అని పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఫిబ్రవరిలోనే జరగాల్సిన పార్టీ అధ్యక్ష ఎన్నికలను.. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీడబ్ల్యూసీ వాయిదా వేసింది.