Kerala: ఇకపై ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ సరఫరా చేయలేం: కేరళ సీఎం విజయన్‌

we will not supply oxygen to other states pinarayi vijayan

  • ప్రధాని మోదీకి విజయన్‌ లేఖ
  • అత్యవసర నిల్వలు సైతం పూర్తవుతున్నాయని వెల్లడి
  • కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా
  • తమ ఆక్సిజన్‌ రాష్ట్ర అవసరాలకే సరిపోతుందని వ్యాఖ్య

ఇతర రాష్ట్రాలకు ఇకపై ఆక్సిజన్‌ సరఫరా చేసేది లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్రానికి తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి సోమవారం లేఖ రాశారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న అత్యవసర ఆక్సిజన్‌ నిల్వలు సైతం పూర్తి కావస్తున్నాయని తెలిపారు. కేవలం 86 మెట్రిక్‌ టన్నుల అత్యవసర నిల్వలు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు.

మే 6న కేంద్ర కమిటీ నిర్ణయించినట్లుగా తమిళనాడుకు 40 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తామన్నారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదని తెలిపారు. ప్రస్తుతం కేరళలో 4,02,640 క్రియాశీలక కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. మే 15 నాటికి ఈ సంఖ్య ఆరు లక్షలకు చేరే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మే 15 నాటికి తమకు 450 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లలో ఐనాక్స్ ప్రధానమైందని విజయన్‌ తెలిపారు. దీని తయారీ సామర్థ్యం 150 మెట్రిక్‌ టన్నులని పేర్కొన్నారు. మొత్తం ఇతర చిన్న ప్లాంట్లతో కలిపి రాష్ట్రంలో రోజుకి 219 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందుబాటులో ఉంటుందని వివరించారు. ఇక ప్రధాన స్టీల్‌ ప్లాంట్లన్నీ కేరళకు భౌగోళికంగా దూరంగా ఉన్న నేపథ్యంలో కేరళలో ఉత్పత్తవుతున్న మొత్తం ఆక్సిజన్‌ తమ రాష్ట్రానికే కేటాయించాలని కోరారు. కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో ప్రస్తుతం కేరళలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News