Manichandana: 'స్వాతి' వారపత్రిక అసోసియేట్ ఎడిటర్ మణిచందన కరోనాతో మృతి
- 'స్వాతి' మ్యాగజైన్ వర్గాల్లో విషాదం
- 'స్వాతి' అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన మణిచందన
- ఏడాది కిందట క్యాన్సర్ బారినపడిన మణిచందన
- ఇటీవలే కరోనా పాజిటివ్
- చికిత్స పొందుతూ కన్నుమూత
'స్వాతి' వారపత్రిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 'స్వాతి' పత్రిక అసోసియేట్ ఎడిటర్ మణిచందన కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. 46 ఏళ్ల మణిచందన 'స్వాతి' ప్రచురణ కర్త, ప్రధాన సంపాదకుడు వేమూరి బలరాం కుమార్తె. మణిచందన భర్త అనిల్ కుమార్ ప్రస్తుతం ఏపీ ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్. మణిచందన, అనిల్ కుమార్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మణిచందన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇటీవలే ఆమెకు కరోనా సోకడంతో పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స అందించినప్పటికీ కోలుకోలేకపోయారు. ఇప్పటి కాలానికి అనుగుణంగా 'స్వాతి' వీక్లీ మ్యాగైజన్ ను తీర్చిదిద్దడంలో మణిచందన ముఖ్యభూమిక పోషించారు. 'స్వాతి' అత్యధిక కాపీలు అమ్ముడవుతున్న పత్రికగా ఇప్పటికీ కొనసాగుతుండడం వెనుక ఆమె కృషి కూడా ఉంది.