Chandrababu: చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం... కలెక్టర్ కు లేఖ రాసిన చంద్రబాబు
- ఏపీలో కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్
- చిత్తూరు జిల్లాలో అధిక సంఖ్యలో కేసులు, మరణాలు
- ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు
- వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలంటూ లేఖ
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక చిత్తూరు జిల్లాలో తీవ్రస్థాయిలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా మరణాల సంఖ్య కూడా జిల్లాలో అధికంగా నమోదవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత జిల్లాలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, చిత్తూరు కలెక్టర్ కు లేఖ రాశారు. కరోనా రోగులకు వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరారు.
కరోనా పరీక్ష కిట్లు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ బెడ్ల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎస్ఏసీ సెంటర్ లో 200 పడకల కొవిడ్ కేంద్రం సిద్ధం చేయాలని సూచించారు. కుప్పం ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని, ఇతర ఏరియా ఆసుపత్రుల్లో 150 వరకు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉంచాలని కోరారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని చంద్రబాబు తన లేఖలో కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.