Visakhapatnam District: సింహాచలం దేవస్థానం బోర్డు నుంచి దాడి దేవి తొలగింపు.. స్టే ఇచ్చిన హైకోర్టు!

Dadi Devi questions CM Jagan for removal from simhachalam trust board
  • దేవిని తొలగించి ఆమె స్థానంలో భాగ్యలక్ష్మికి అవకాశం
  • తనను ఎందుకు తొలగించారో చెప్పాలని దేవి డిమాండ్
  • సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్న
సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు నుంచి తనను తొలగించడంపై దాడి దేవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన దేవి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా కొనసాగుతుండగా ఆమెను అకస్మాత్తుగా తొలగించిన ప్రభుత్వం ఆ స్థానంలో విశాఖకు చెందిన ఆళ్ల భాగ్యలక్ష్మిని నియమించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేవి తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

వైసీపీని ఏర్పాటు చేసినప్పటి నుంచి తన భర్త పార్టీ కోసం పనిచేస్తున్నారని అయినప్పటికీ ఎలాంటి పదవులను తాము ఆశించలేదన్నారు. అయితే, పిలిచి మరీ సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా తనకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. మరి అలాంటిది తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎందుకు తొలగించారని ఆమె ప్రశ్నించారు. ఇదెక్కడి అన్యాయం జగనన్నా? అంటూ నిలదీశారు.  తనను ఎందుకు తొలగించారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

కాగా, దాడి దేవి స్థానంతో భాగ్యలక్ష్మిని దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. జీవో అమలును 8 వారాలపాటు నిలిపివేసిన ధర్మాసనం అప్పటి వరకు దేవిని కొనసాగించాలని పేర్కొంది.

దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక కమిషనర్, సింహాచలం దేవస్థానం ఈవోలతో పాటు, ఆళ్ల భాగ్యలక్ష్మికి నోటీసులు జారీ చేసింది. ట్రస్టు బోర్డు నుంచి తనను అకారణంగా తొలగించారంటూ దేవి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
Visakhapatnam District
Simhachalam
Trust Board
Dadi Devi
YSRCP
YS Jagan

More Telugu News