Jagan: కొవాగ్జిన్ సాంకేతికతను ఇతర సంస్థలకు బదలాయించండి: ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం జగన్

CM Jagan wrote PM Modi to direct Bharat Biotech
  • దేశంలో కరోనా వ్యాక్సిన్ డోసుల కొరత తీవ్రం
  • ఎటూ చాలని కొవాగ్జిన్, కొవిషీల్డ్
  • కేవలం రెండు సంస్థల నుంచే ఉత్పత్తి
  • మరిన్ని సంస్థలకు ఉత్పత్తి అవకాశం ఇవ్వాలన్న కేజ్రీవాల్
  • అదే బాటలో సీఎం జగన్ ప్రతిపాదన
  • భారత్ బయోటెక్ ను ఆదేశించాలని విజ్ఞప్తి
కరోనా వ్యాక్సిన్ కొరతతో సతమతమవుతున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరహాలోనే ఏపీ సీఎం జగన్ కూడా ఆసక్తికర ప్రతిపాదన చేశారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ల తయారీ ఫార్ములాను ఇతర సంస్థలకు కూడా అందిస్తే, వ్యాక్సిన్లను భారీగా ఉత్పత్తి చేసేందుకు వీలవుతుందని కేజ్రీవాల్ పేర్కొనగా.... భారత్ బయోటెక్ నుంచి కొవాగ్జిన్ సాంకేతికతను ఇతర సంస్థలకు బదలాయించాలని ఏపీ సీఎం జగన్ సూచించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు కర్ఫ్యూ, ఆంక్షలు విధిస్తున్నా వ్యాక్సినేషన్ ఒక్కటే తిరుగులేని పరిష్కారం అని సీఎం జగన్ తన లేఖలో అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా లేవని విచారం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తొలినాళ్లలో ఏపీలో రోజుకు 6 లక్షల డోసులు ఇచ్చే స్థితిలో ఉన్నామని, కానీ ఇప్పుడు తగినన్ని డోసులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు.

ఐసీఎంఆర్, ఎన్ఐవీ సంస్థల సహకారంతో భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినా, దేశ అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయడంలో ఆ సంస్థ సామర్థ్యం సరిపోవడంలేదని తెలిపారు. భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కరోనా టీకా డోసులు ఇప్పుడు ఎటూ చాలవని వివరించారు. ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఇవ్వాలంటే ఎన్నో నెలలు పడుతుందని, అందుకే కొవాగ్జిన్ సాంకేతికతను టీకా ఉత్పత్తి చేయగల ఇతర సంస్థలకు బదలాయించాలని సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

టీకా తయారీ సాంకేతిక సమాచారాన్ని ఇతర సంస్థలతో పంచుకునేలా భారత్ బయోటెక్ ను ఆదేశించాలని కోరారు. తద్వారా దేశవ్యాప్తంగా టీకా ఉత్పత్తిదారులను ప్రోత్సహించి, ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లను తయారుచేయాలని సూచించారు. ఈ కష్టకాలంలో యావత్ ఉత్పత్తిరంగం టీకా తయారీ దిశగా కదలాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఈ విషయంలో ప్రధాని చొరవ తీసుకుని వ్యాక్సిన్ ఉత్పత్తిపై తగిన ఆదేశాలు ఇస్తారని భావిస్తునట్టు తన లేఖలో పేర్కొన్నారు.
Jagan
Narendra Modi
COVAXIN
Bharat Biotech
Manufacturing
India

More Telugu News