Puri Jagannadh: భారతదేశంలోని బియ్యం రకాలపై పూరీ జగన్నాథ్ 'మ్యూజింగ్స్'
- వివిధ అంశాలపై 'మ్యూజింగ్స్'
- రాజముడి బియ్యం వెరైటీపై పూరీ అభిప్రాయాలు
- ఇమ్యూనిటీ పెరుగుతుందని వెల్లడి
- మధుమేహం ఉన్నవారికి మంచిదని వివరణ
- దీని గంజి శ్రేష్టకరమని సూచన
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన మ్యూజింగ్స్ లో భాగంగా భారతదేశంలోని బియ్యం రకాలపై ప్రసంగించారు. ఒకప్పుడు దేశంలో లక్ష బియ్యం రకాలు వ్యాప్తిలో ఉండేవన్న విషయాలను ఆయన వివరించారు. ఒక రైతు చనిపోతే అతను పండించే రకం బియ్యం మరిక దొరికేవి కావని తెలిపారు. కాలక్రమంలో 40 వేల బియ్యం రకాలు మిగిలినా, గత అర్ధశతాబ్ద కాలంలో అవి కూడా అంతరించిపోయి, చివరికి 6 వేల రకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
వీటిలో రాజముడి బియ్యం అనే రకంపై పూరీ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. ఈ బియ్యం జన్మస్థలం కర్ణాటక అని, ఒకప్పుడు ఈ రాజముడి బియ్యం నగదుతో సమానంగా చలామణీ అయినట్టు వెల్లడించారు. రైతులు పన్నులు చెల్లించేందుకు డబ్బు లేకపోతే, ఈ రాజముడి బియ్యాన్ని చెల్లించేవారని వివరించారు. ప్రస్తుతం రాంబాబు, విజయరామ్ అనే సోదరులు ఈ బియ్యాన్ని పండిస్తున్నారని, వారే ఈ విషయాలను తనకు వివరించినట్టు తెలిపారు.
రాజముడి బియ్యం ప్రత్యేకతలు ఏంటంటే... ఇది మధుమేహం ఉన్నవారికి ఔషధంలా పనిచేస్తుందని, ఆడవాళ్లలో రుతుక్రమ సమస్యలు దూరం చేస్తుందని వెల్లడించారు. ఈ బియ్యాన్ని 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టి, ఎసరు పోసి వండుకోవాలని పూరీ సూచించారు. వార్చిన గంజిని సాయంత్రం వేళల్లో తాగితే ఎంతో ఆరోగ్యకరమని, వ్యాధి నిరోధక శక్తి విశేషంగా వృద్ధి చెందుతుందని అన్నారు. ఈ బియ్యం వాడడం మొదలుపెట్టిన కొన్నిరోజుల్లోనే తేడా తెలుస్తుందని స్పష్టం చేశారు.