COVID19: భారత్ లో పతాక స్థాయిని దాటేసిన కరోనా సెకండ్ వేవ్.. కేంబ్రిడ్జి అధ్యయనంలో వెల్లడి
- కేసులు తగ్గుముఖం పట్టాయని వెల్లడి
- కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నాయని ఆందోళన
- రెండు వారాలు ఇలాగే ఉంటుందని రిపోర్ట్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు పతాక స్థాయిని దాటేశాయా? అంటే లండన్ లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ అవుననే సమాధానమిస్తోంది. భారత్ లో సెకండ్ వేవ్ పై వర్సిటీలోని జడ్జ్ బిజినెస్ స్కూల్, ద నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ రీసెర్చ్ కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. ఆ అధ్యయనంలో భాగంగా దేశంలో ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ పతాక స్థాయికి చేరిందని, మెల్లమెల్లగా కేసుల్లో క్షీణత కనిపిస్తోందని పేర్కొన్నారు.
కొన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గుతున్నా.. ఇంకొన్ని రాష్ట్రాల్లో మాత్రం పెరుగుతున్నాయని వెల్లడించారు. అసోం, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, త్రిపుర వంటి రాష్ట్రాల్లో వచ్చే రెండు వారాల్లో కేసులు భారీగా పెరుగుతాయని హెచ్చరించారు. రోజువారీ నమోదవుతున్న కేసులు, నిపుణుల నివేదికల ఆధారంగా పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.
‘
‘‘భారత్ లో కేసుల పెరుగుదలకు గల కారణాలపై ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు విషయాలను వెల్లడించింది. కరోనా వేరియంట్లు పెరగడం, కొన్ని మత కార్యక్రమాలు జరగడం, రాజకీయ ప్రచారాల వంటి వాటి వల్ల మహమ్మారి వ్యాప్తి బాగా పెరిగిపోయింది. వేరియంట్లూ ఎక్కువయ్యాయి. ప్రజారోగ్యం, సామాజిక చర్యల్లో లోపాల వల్ల కేసులు మరింత ఎక్కువయ్యాయి’’ అని పరిశోధకులు పేర్కొన్నారు.