Cyclone: 4 రోజుల్లో అరేబియా సముద్రంలో ఈ ఏడాది తొలి తుపాను

Cyclone likely to form over Arabian Sea in next few days
  • మే 16న ‘తౌకతీ’ ఏర్పడే అవకాశం
  • ఎల్లుండి అల్పపీడనానికి చాన్స్
  • లక్షద్వీప్ వైపు పయనం
  • తీవ్ర తుపానుగా మార్పు
  • కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో ప్రభావం
అరేబియా సముద్రంలో రాబోయే కొన్ని రోజుల్లోనే తుపాను ఏర్పడబోతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఒకవేళ అదే నిజమైతే, ఈ ఏడాది ఏర్పడే తొలి తుపాను అదేనని పేర్కొంది. దీనికి మయన్మార్ సూచించిన ‘తౌకతీ’ అని పేరు పెట్టనున్నారు. మయన్మార్ లో దాని అర్థం బల్లి లేదా ఆ జాతికి చెందిన జీవి.

ఈ తుపాను ప్రభావం దేశ పశ్చిమ తీరంలో ఎక్కువగా ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 16 నాటికి తుపాను వస్తుందని, ఈ నెల 15–16 తేదీల మధ్య లక్షద్వీప్ లోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయని హెచ్చరించింది.  

ఆగ్నేయ అరేబియా సముద్రంలో 14 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది. 15న లక్షద్వీప్ కు చేరుకుని 16న తుపానుగా మరింత తీవ్ర రూపం దాలుస్తుందని తెలిపింది. మళ్లీ అది వాయవ్య దిశగా ప్రయాణిస్తూ మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది.

లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో తుపాను ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. 17 లేదా 18న తుపాను గమనం మారి కచ్, దక్షిణ పాకిస్థాన్ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని, అప్పుడు గుజరాత్ తీరంపైనా దాని ప్రభావం ఉంటుందని తెలిపింది. మరో రెండు, మూడ్రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని తెలిపింది.
Cyclone
Cyclone Tauktae
Myanmar
IMD

More Telugu News