Jagan: కరోనాతో సహజీవనం చేస్తూనే.. దానితో యుద్ధం చేయాలి: ఏపీ సీఎం జగన్
- వ్యాక్సినేషన్ పూర్తి చేస్తేనే కరోనాను పూర్తిగా నివారించవచ్చు
- దేశానికి మొత్తం 172 కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాలి
- ఇప్పటివరకు 18 కోట్ల డోసులను మాత్రమే ఇవ్వగలిగారు
- నెలకు కేవలం 7 కోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తి మాత్రమే ఉంది
దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. అలాగే, కరోనా పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ... వ్యాక్సినేషన్ పూర్తి చేస్తేనే కరోనాను పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. అయితే, భారత్‌లో వ్యాక్సినేషన్ కోసం మొత్తం 172 కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాల్సి ఉంటుందని చెప్పారు.
ఇప్పటివరకు 18 కోట్ల డోసులను మాత్రమే ఇవ్వగలిగారని జగన్ తెలిపారు. అలాగే, ఏపీకి మొత్తం 7 కోట్ల డోసులు కావాల్సి ఉందని చెప్పారు. ఇప్పటివరకు కేవలం 73 లక్షల డోసులను మాత్రమే ఇచ్చారని వివరించారు. భారత్‌లో సీరం, భారత్ బయోటెక్ సంస్థలు వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయన్నారు.
భారత్ బయోటెక్ నెలకు కోటి వ్యాక్సిన్లు తయారు చేస్తోందని, అలాగే, సీరం ఇన్‌స్టిట్యూట్ కు నెలకు 6 కోట్ల వ్యాక్సిన్ల తయారీ సామర్థ్యం ఉంటుందని తెలిపారు. అంటే దేశంలో నెలకు కేవలం 7 కోట్ల వ్యాక్సిన్ల సామర్థ్యం మాత్రమే ఉందని చెప్పారు. కాబట్టి దేశ ప్రజలు కరోనాతో సహజీవనం చేస్తూనే, మరోపక్క దానితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరు కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.