Rahul Gandhi: వ్యాక్సిన్లు, ఔషధాలతో పాటు ప్రధాని మోదీ కనిపించకుండా పోయారు: రాహుల్ గాంధీ
- సెంట్రల్ విస్టా, జీఎస్టీలే కనిపిస్తున్నాయని కామెంట్
- వాటితో పాటు మోదీ ఫొటోలే దర్శనమిస్తున్నాయని ఆగ్రహం
- వ్యాక్సిన్ పాలసీపై శశిథరూర్, మనీశ్ తివారీ విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ కనిపించట్లేదంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కరోనా టీకాలు, ఆక్సిజన్, ఔషధాలతో సహా ఆయన కనిపించకుండా పోయారని వ్యాఖ్యానించారు. అయితే, సెంట్రల్ విస్టా, ఔషధాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ), ప్రధాని మోదీ ఫొటోలు మాత్రం కనిపిస్తున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ లోని ఇతర సీనియర్ నేతలూ కేంద్ర ప్రభుత్వం తీసుకునే వ్యాక్సిన్ నిర్ణయాలపై విమర్శలు కురిపించారు. మహమ్మారి నియంత్రణలో వారి నేరపూరితమైన నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని కాంగ్రెస్ ఎంపీ మనీత్ తివారీ ట్వీట్ చేశారు. మార్పు కోసం ఏదైనా చేయడంపై దృష్టి పెట్టాలని అన్నారు.
భారత్ బయోటెక్ కొవాగ్జిన్ పై కాంగ్రెస్ అనుమానాలు, ఆరోపణల వల్లే ఆ వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిందంటూ కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పూరి విమర్శించారు. అయితే, ఆ వ్యాఖ్యలను మరో ఎంపీ శశిథరూర్ తప్పుబట్టారు. కాంగ్రెస్ ట్వీట్ల వల్లే వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిందా? అని ప్రశ్నించారు. తన ట్వీట్ల వల్లే కేంద్ర ప్రభుత్వం సరిపడా వ్యాక్సిన్లకు ఆర్డర్ పెట్టలేదా? అని మరో ప్రశ్న సంధించారు.