Telangana: కేసీఆర్ పాలన పిల్లి కళ్లుమూసుకొని పాలు తాగిన చందంగా ఉంది: వై.ఎస్.షర్మిల
- కేసీఆర్ కళ్లు, చెవులు మూసుకొని పాలన సాగిస్తున్నారు
- కేటీఆర్‌కూ ప్రజల కరోనా బాధలు పట్టడం లేదు
- రెమ్‌డెసివిర్‌ను అధిక ధరకు అమ్ముతున్నా పట్టింపు లేదు
- గారడీ మాటలు ఆపాలని కేసీఆర్, కేటీఆర్‌కు హితవు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్.షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు, కేసీఆర్ కళ్లు, చెవులు మూసుకొని పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ‘చిన్న సార్’గా అభివర్ణించిన ఆమె.. ఆయనకు ప్రజల కరోనా కష్టాలు అసలే కనపడడడం లేదన్నారు.
కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తున్న రెమ్‌డెసివిర్ కోసం జనం భారీ క్యూలు కడుతున్నారని, అయినా తెలంగాణ ప్రభుత్వానికి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రూ. 3,500 విలువ చేసే ఒక్కో ఇంజక్షన్ రూ. 40 వేలకు అమ్ముతున్నారని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా.. ప్రభుత్వానికి మాత్రం పట్టడం లేదని మండిపడ్డారు. ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మరణిస్తుంటే తమకేమీ పట్టనట్లు ఉంటున్నారన్నారు. ‘తండ్రీ కొడుకులు తమ గారడి మాటలను పక్కన పెట్టి, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి’ అని షర్మిల హితవు పలికారు.