Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’ బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన సినిమా.. ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదు: ఎన్టీఆర్
- రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్
- సీతారామరాజుగా చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్
- మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి
- కరోనాతో ఆగిపోయిన మిగతా పనులు
- 'పాన్ ఇండియా' అనడం నచ్చదని వ్యాఖ్య
- ఆసక్తికర విషయాలు పంచుకున్న తారక్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదని తెలిపారు. ఇది బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన సినిమా అని చెప్పారు.
ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం సీతారామరాజు, కొమురం భీం గురించి లోతుగా తెలుసుకున్నామని ఎన్టీఆర్ తెలిపారు. వారు సాధించిన విజయాలను ప్రపంచానికి చెప్పడమే తమ పని అని అభిప్రాయపడ్డారు.
ఇక దేశవ్యాప్తంగా విడుదలయ్యే సినిమాలను పాన్ ఇండియా చిత్రాలుగా పేర్కొనడం తనకు నచ్చదని తారక్ తెలిపారు. ‘పాన్’ అంటే తనకు వంట పాత్ర గుర్తొస్తుందని అభిప్రాయపడ్దారు. ఒక మంచి సినిమాను దేశవ్యాప్తంగా అన్ని భాషలకు చెందిన ప్రజలకు చూపించడమే తమ ఉద్దేశమని తెలిపారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి మెజారిటీ భాగం షూటింగ్ పూర్తయిందని తారక్ తెలిపారు. కరోనా వల్ల మిగతా పనులు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయని, అయినప్పటికీ ముందు అనుకున్నట్లుగా సినిమా అక్టోబర్‌లో విడుదలయ్యే అవకాశాలు ఇంకా ఉన్నాయని తెలిపారు.