Sonu Sood: ఈ నెల్లూరు అమ్మాయే దేశంలో అత్యంత సంపన్నురాలు: సోనూ సూద్
- యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగలక్ష్మి
- అంధురాలైన నాగలక్ష్మి స్వస్థలం నెల్లూరు జిల్లా వరికుంటపాడు
- సోనూ సూద్ ఫౌండేషన్ కు రూ.15 వేలు విరాళం
- చలించిపోయిన సోనూ సూద్
సోనూ సూద్... ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరిది. దేశంలో ప్రతి మూల సోనూ సూద్ పేరు ప్రతిధ్వనిస్తుంది. కరోనా సంక్షోభ సమయంలో ఆయన అందిస్తున్న సేవలు అసమానం. ఖర్చుకు వెనుకాడకుండా ఆపన్నుల ముఖంలో సంతోషాన్ని చూడాలని తపిస్తున్న సోనూ సూద్ ను ఏపీలోని నెల్లూరుకు చెందిన ఓ యువతి విశేషంగా ఆకట్టుకుంది. ఆమె పేరు బొడ్డు నాగలక్ష్మి. ఆమె ఓ అంధురాలు. అయినప్పటికీ యూట్యూబ్ వీడియోల ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.
కరోనా విపత్కర సమయంలో సోనూ సూద్ సేవల గురించి విన్న నాగలక్ష్మి తనవంతు సాయంగా సోనూ సూద్ ఫౌండేషన్ కు రూ.15 వేలు విరాళంగా అందించింది. దీనిపై సోనూ సూద్ చలించిపోయారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన నాగలక్ష్మి తన ఐదు నెలల పింఛను సొమ్మును తనకు విరాళంగా ఇచ్చిందని వెల్లడించారు. తనవరకు నాగలక్ష్మే అత్యంత సంపన్న భారతీయురాలు అని కొనియాడారు. ఎదుటి వ్యక్తి బాధను చూడ్డానికి కంటి చూపు అవసరం లేదని నిరూపించిందని, నాగలక్ష్మి నిజమైన హీరో అని సోనూ సూద్ కొనియాడారు.