Corona Virus: ఆక్సీజనరేటర్ల ఏర్పాటుతో ఆక్సిజన్ కొరత తీర్చొచ్చు: డాక్టర్ కేవీరావు

Oxygen shortage can be met with the installation of oxygen generators

  • ఈ యంత్రాలు గాలిలో నుంచి నత్రజనని గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి
  • రీఫిల్లింగ్, మరమ్మతుల గోల ఉండదు
  • ఏడాదికోసారి జియోలైట్ పరికరాన్ని మారిస్తే సరిపోతుంది

వేధిస్తున్న ఆక్సిజన్ కొరతకు ప్రత్యామ్నాయంగా ఆక్సీజనరేటర్ ఉండాలని ఆంధ్రవిశ్వవిద్యాలయ రసాయన సాంకేతిక శాస్త్ర విశ్రాంత ఆచార్యులు, డెహ్రాడూన్ పెట్రోలియం విశ్వవిద్యాలయ ముఖ్య ఆచార్యులు డాక్టర్ కేవీ రావు అన్నారు.

 ఆక్సీజనరేటర్ అంటే మరేంటో కాదు.. గాలిలో నుంచి ఆక్సిజన్‌ను తయారుచేసేదే. ఈ యంత్రంలో ఉండే జియోలైట్ అనే పరికరం గాలిలోని నత్రజనిని సంగ్రహించి ఆక్సిజన్‌ను బయటకు విడుదల చేస్తుంది. ఇది 93 నుంచి 96 శాతం వరకు ఉంటుంది. ఆక్సిజన్ వచ్చే మార్గానికి గొట్టాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆక్సిజన్‌ను వినియోగించుకోవచ్చు.

నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్ అందించే యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా 50 ఆక్సిజన్ లేదంటే పది ఐసీయూ బెడ్లకు ఏడాదికిపైగా నిరంతరాయంగా ఆక్సిజన్ అందించొచ్చని కేవీరావు తెలిపారు. దీనికి రీఫిల్లింగ్ అవసరం ఉండదని, విద్యుత్ కనెక్షన్ ఇస్తే సరిపోతుందని అన్నారు.

ఈ యంత్రానికి మరమ్మతులు కూడా రావని, ఏడాది తర్వాత జియోలైట్ పరికరాన్ని మార్చుకుంటే సరిపోతుందని వివరించారు. 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సీజనరేటర్ల ఖరీదు రూ. 30 నుంచి రూ. 40 లక్షల వరకు ఉందన్నారు. నిమిషానికి 10 లీటర్ల సామర్థ్యం ఉన్నవి రూ. 85 వేలకే లభిస్తాయన్నారు. కాబట్టి ప్రభుత్వం వీటిపై దృష్టిసారిస్తే మంచి ఫలితాలు ఉంటాయని కేవీరావు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News