New Delhi: టీకా లేకున్నా ఆ కాలర్ ట్యూన్‌తో వేధింపులేంటి?: ఢిల్లీ హైకోర్టు మండిపాటు
- టీకాలు సరిపడా లేవు కానీ టీకా వేయించుకోమని చెబుతారా?
- చూస్తుంటే ఇంకో పదేళ్లు ఇది కొనసాగేలా ఉంది
- ఇంకేదైనా కొత్తగా ట్రై చేయండి
ఫోన్ చేయగానే తొలుత వినిపించే కరోనా కాలర్ ట్యూన్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో సరిపడా వ్యాక్సిన్లు లేకున్నా ఫోన్ చేసినప్పుడల్లా చిరాకుపరిచే ఆ కాలర్ ట్యూన్‌తో విసిగిస్తున్నారంటూ తీవ్రంగా మండిపడింది. టీకాలు లేకున్నా తప్పకుండా టీకాలు వేసుకోమంటూ ఆ కాలర్ ట్యూన్ ద్వారా చెబుతున్నారని, వారికి టీకా ఎలా అందుతుందని, ఎవరు వేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది.
అసలు ఈ సందేశం ఉద్దేశం ఏమిటని నిలదీసింది. ప్రతి ఒక్కరికీ టీకా అందించాలి. చూస్తుంటే ఈ కాలర్ ట్యూన్ ఇంకో పదేళ్లు కొనసాగేలా కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఇంకేదైనా కొత్తది వింటే కొంత ఉపయోగకరంగా ఉంటుందని, ఒకవేళ డబ్బులు తీసుకున్నా పరవాలేదు కానీ అందరికీ అయితే టీకా ఇవ్వాలని జస్టిస్ విపిన్ సంఘి, రేఖా పల్లితో కూడిన ధర్మాసనం పేర్కొంది.