USA: రెండు డోసుల మధ్య వ్యవధి పెంచడం కప్పిపుచ్చడం కాదు: భారత్​ నిర్ణయానికి ఆంథోనీ ఫౌచీ మద్దతు

Would not Refer To It As Cover Up Dr Fauci On Covishield Dose Gap
  • గ్యాప్ పెంచడం మంచిదేనని వ్యాఖ్య
  • టీకా ప్రభావం మెరుగవుతుందని వెల్లడి
  • ప్రతికూలతలు ఏమీ ఉండవని కామెంట్
  • వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయాలని సూచన
కరోనా వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచడం మంచిదేనని అమెరికా శ్వేత సౌధ ముఖ్య ఆరోగ్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు. కొవిషీల్డ్ మొదటి డోసు, రెండో డోసు మధ్య వ్యవధిని 6–8 వారాల నుంచి 12–16 వారాలకు భారత్ పెంచడంపై ఆయన స్పందించారు. రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచడం ఎట్టి పరిస్థితుల్లోనూ కప్పి పుచ్చడం కాదన్నారు.

డోసుల మధ్య వ్యవధి ఎక్కువుంటే వ్యాక్సిన్ ప్రభావం కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పారు. దాని వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలూ ఉండవన్నారు. రెండు డోసుల మధ్య వ్యవధి పెంచినంత మాత్రాన దానిని వ్యాక్సిన్ల కొరతతో ముడిపెట్టడం భావ్యం కాదన్నారు. అది కప్పిపుచ్చుకోవడం ఎందుకవుతుందని ఆయన ప్రశ్నించారు. భారత్ ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయాలని ఆయన సూచించారు.

కరోనాతో పోరులో భారత్ సైన్యాన్ని రంగంలోకి దించాలని ఆయన సూచించారు. ప్రైవేట్ లో వేగంగా కాని పనుల కోసం ఆర్మీ సాయం తీసుకోవాల్సిందేనని చెప్పారు. ఆసుపత్రుల్లో ప్రస్తుతం బెడ్ల కొరత చాలా ఉందని, కాబట్టి వేగంగా ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలంటే సైన్యం సాయం తప్పనిసరి అని పేర్కొన్నారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్లు లేకపోవడం వల్లే రెండు డోసుల మధ్య కాల వ్యవధిని పెంచారంటూ కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు సెటైర్లు వేశాయి. ఈ నేపథ్యంలోనే ఆంథోనీ ఫౌచీ భారత్ తీసుకున్న నిర్ణయానికి మద్దతునిచ్చారు.
USA
Anthony Fauci
Covishield
COVID19
India

More Telugu News