Black Fungus: బ్లాక్ ఫంగస్ నివారణ, నియంత్రణపై కేంద్ర ఆరోగ్య మంత్రి సూచనలు
- లక్షణాలు, సోకకుండా జాగ్రత్తలపై సలహాలు
- ఆదిలోని గుర్తించి చికిత్స చేయడం మేలని కామెంట్
- దానిపై అవగాహన కల్పించాలని సూచన
దేశంలో బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్) కేసులు పెరిగిపోతుండడంతో దాని నివారణ, నియంత్రణపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పలు సూచనలు చేశారు. కరోనా బాధితులు దాని బారిన పడి ప్రాణాలు కోల్పోతుండడంతో.. ఆదిలోనే దానిని గుర్తించి చికిత్స చేయడం, ప్రజలకు దానిపై అవగాహన కల్పించడం ద్వారా బ్లాక్ ఫంగస్ కు చెక్ పెట్టొచ్చని ఆయన చెప్పారు.
బ్లాక్ ఫంగస్ లక్షణాలు, అది సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోకితే తీసుకునే చర్యల వంటి వాటిపై ఆయన ట్విట్టర్ లో పలు వివరాలను పంచుకున్నారు. ఇవీ ఆయన చేస్తున్న సూచనలు..
బ్లాక్ ఫంగస్ ఎక్కువగా అనారోగ్యంతో బాధపడే వాళ్లకే సోకుతోంది. ఇతర రోగకారక క్రిములతో పోరాడే శక్తిని తగ్గించేస్తోంది. ఇతర జబ్బులున్న వారికి, వొరికొనజోల్ మందులు వాడుతున్న వారికి, మధుమేహం అతిగా ఉన్నవారికి, స్టెరాయిడ్లు వాడడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయిన వారికి, ఐసీయూలో ఎక్కువ కాలం ఉన్న వారికి బ్లాక్ ఫంగస్ ఎక్కువగా సోకుతోంది. కళ్లు, ముక్కు ఎరుపెక్కడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి తీసుకోలేకపోవడం, రక్తపు వాంతులు, మానసిక సమస్యల వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇవీ చేయాల్సినవి..
* మధుమేహాన్ని ఎప్పటికప్పుడు నియంత్రణలో పెట్టుకోవాలి.
* మధుమేహులు కొవిడ్ సోకి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక రక్తంలోని చక్కెర స్థాయులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
* స్టెరాయిడ్లను పద్ధతి ప్రకారం వాడాలి.
* ఆక్సిజన్ చికిత్సలో వాడే హ్యుమిడీఫయర్స్ కోసం పరిశుభ్రమైన నీటిని వాడాలి.
* చికిత్సలో మోతాదు ప్రకారమే యాంటీ బయాటిక్స్, యాంటీ ఫంగల్స్ వాడాలి.
ఇవీ చేయకూడనివి..
* లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యంగా ఉండడం
* కరోనా సోకి చికిత్స తీసుకునేటప్పుడు ముక్కులు మూసుకుపోతే బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ అనుకోవడం.
* బ్లాక్ ఫంగస్ చికిత్సలో నిర్లక్ష్యంగా ఉండడం.