Sputnik V: స్పుత్నిక్ వి టీకా ధరను ప్రకటించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్
- ఒక్కో డోసుకు రూ.995గా నిర్ణయించిన సంస్థ
- టీకాకు రూ.948+5% జీఎస్టీ
- దిగుమతి చేసుకున్న వాటికే ధరల నిర్ణయం
- ఇవ్వాళే ఫస్ట్ డోస్ వేసినట్టు ప్రకటన
- మన దగ్గర తయారయ్యే వాటికి ధర తక్కువేనని హామీ
స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధరను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఖరారు చేసింది. ఒక్కో డోసుకు రూ.948గా నిర్ణయించింది. దానికి 5% జీఎస్టీతో రూ.995గా ఉండనుంది. రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్ఎఫ్ఐడీ) ఆధ్వర్యంలో గమాలియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి టీకాల ఉత్పత్తి కోసం డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉండడంతో వారం క్రితమే స్పుత్నిక్ టీకాలను కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటు రెడ్డీస్ కూ స్పుత్నిక్ టీకాల ఉత్పత్తికి అనుమతి కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం వాటి ధరలను సంస్థ ఖరారు చేసింది.
పరిమిత పైలట్ ప్రాజెక్టులో భాగంగా స్పుత్నిక్ వి టీకాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈరోజు తొలి డోసును లబ్ధిదారుకు వేసినట్టు వెల్లడించింది. టీకాల ఉత్పత్తిని ప్రారంభించిందీ.. లేనిదీ.. సంస్థ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రకటించిన ధరలు దిగుమతి చేసుకున్న డోసులపైనే అని మాత్రం స్పష్టం చేసింది. స్థానికంగా సంస్థ ఉత్పత్తి చేసిన టీకాలకు తక్కువ ధరలే ఉంటాయని హామీ ఇచ్చింది.
మే 1న భారత్ కు దిగుమతైన వ్యాక్సిన్ల వాడకానికి కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులను ఇచ్చిందని చెప్పింది. రాబోయే రోజుల్లో మరిన్ని డోసులు దేశానికి వస్తాయని తెలిపింది. దాంతో పాటు ఇక్కడ ఉత్పత్తయ్యే వ్యాక్సిన్లూ మార్కెట్ లోకి వస్తాయంది. అయితే, మన దగ్గర ఉత్పత్తయ్యే వ్యాక్సిన్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయన్న దానిపై మాత్రం సంస్థ ఎలాంటి వివరాలూ చెప్పలేదు.