Narendra Modi: ప్రధాన సేవకుడిగా అందరి బాధలనూ పంచుకుంటా: ప్రధాని నరేంద్ర మోదీ
- రూపం మారుస్తూ మహమ్మారి సవాళ్లు విసురుతోంది
- కనిపించని శత్రువుతో పోరాడుతున్నామని కామెంట్
- కరోనాతో ప్రజల బాధను అర్థం చేసుకోగలనని వ్యాఖ్య
- రూపం మారిన మహమ్మారి వల్లే ఇంత తీవ్రత అని ఆవేదన
- ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేస్తామని హామీ
ఎప్పటికప్పుడు రూపాన్ని మార్చుకుంటూ ప్రపంచానికి కరోనా మహమ్మారి సవాళ్లు విసురుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కనిపించని శత్రువుతో అందరం పోరాడుతున్నామని చెప్పారు. అలాంటి మహమ్మారితో ప్రజలు పడుతున్న బాధలు, ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని ఆయన అన్నారు.
‘‘మన మనసులకు దగ్గరగా ఉండే ఎంతో మందిని మహమ్మారి బలి తీసుకుంది. వారు పడుతున్న బాధలు నేను అర్థం చేసుకోగలను. వారి ఆవేదనను నేనూ అనుభవిస్తున్నాను’’ అని ఆయన చెప్పుకొచ్చారు. శుక్రవారం 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని జమ చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొలిసారి బెంగాల్ రైతులూ పథకం ఫలాలు అందుకున్నారు.
ప్రతి ఒక్కరి ప్రధాన సేవకుడిగా.. అందరి బాధలనూ పంచుకుంటానని స్పష్టం చేశారు. రూపం మార్చుకుని మరింత ప్రమాదకరంగా తయారైన మహమ్మారి వల్లే దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత వందేళ్లలో ఎన్నడూ లేనంత ప్రమాదకరమైన మహమ్మారిని దేశం ఎదుర్కొంటోందన్నారు.
మనకున్న వనరులను వీలైనంత మేర వాడుకోవడం కోసం అన్ని అడ్డంకులను తప్పిస్తున్నామని మోదీ చెప్పారు. వీలైనంత ఎక్కువ మందికి కరోనా టీకాలు వేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటిదాకా 18 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ ఉచితంగా టీకాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం కరోనా నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సినే రక్షణ కవచమన్నారు.