YS Sharmila: మహిళలకు సాయం కోసం 'వైఎస్ఎస్ఆర్ టీమ్' ఏర్పాటు చేసిన షర్మిల
- కరోనా కారణంగా మగదిక్కు కోల్పోయిన మహిళలకు ఆసరా
- తాము చేయూతగా నిలుస్తామని షర్మిల భరోసా
- అందుకే టీమ్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి
- ఆపదలో తోడుగా ఉంటుందని వివరణ
కరోనా బాధితుల కోసం వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా జీవిత భాగస్వాములను, కన్నబిడ్డలను, అయినవారిని కోల్పోయిన మహిళలకు ఆసరాగా నిలిచేందుకు 'వైఎస్ఎస్ఆర్' టీమ్ ఏర్పాటు చేశారు.
తమ కుటుంబాలకు ఆర్థిక అండగా నిలిచే ఎంతోమంది కరోనా బారినపడి చనిపోయారని షర్మిల వెల్లడించారు. కుటుంబ పెద్దదిక్కుగా నిలిచే తండ్రి/భర్త/కొడుకును కరోనాకు కోల్పోయి, కుటుంబ పోషణ చేయలేక, నిరాశా నిస్పృహలతో కుంగిపోతున్న మహిళల బాధను కాస్తయినా పంచుకోవాలన్ను ఉద్దేశంతో 'వైఎస్ఎస్ఆర్ టీమ్' ఏర్పాటు చేస్తున్నట్టు షర్మిల వివరించారు. తెలంగాణ ఆడబిడ్డలు ధైర్యం కోల్పోరాదని పిలుపునిచ్చారు.
"మీ కాళ్లపై మీరు నిలబడడానికి, మళ్లీ మీ జీవితం సాఫీగా సాగేందుకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకుంటున్నాను. మీరంతా మన వైఎస్సార్ కుటుంబ సభ్యులని భావిస్తున్నాను. ఇకపై 'వైఎస్ఎస్ఆర్ టీమ్' ఆపదలో మీకు ఉంటుంది. సాయం కావాల్సి వస్తే 040-48213268 ఫోన్ నెంబరుకు సమాచారం అందించండి" అని షర్మిల సూచించారు.