Nara Lokesh: రఘురామ అరెస్ట్ జగన్ సైకో మనస్తత్వానికి నిదర్శనం: లోకేశ్
- రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
- అరెస్టును తీవ్రంగా ఖండించిన లోకేశ్
- జగన్ అసమర్థతను ప్రశ్నించడమే నేరమా అంటూ వ్యాఖ్యలు
- సుప్రీం ఆదేశాలను కూడా లెక్కచేయలేదని ఆరోపణ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ స్పందించారు. రఘురామ అరెస్ట్ జగన్ సైకో మనస్తత్వానికి నిదర్శనం అని విమర్శించారు. జగన్ అసమర్థతను ఎత్తిచూపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు లోకేశ్ ట్వీట్ చేశారు. ప్రజల ప్రాణ రక్షణ గురించి పట్టించుకోకుండా, కక్ష తీర్చుకునేందుకు యంత్రాంగాన్ని వాడుకుంటున్న ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ తప్ప దేశంలో మరెవ్వరూ లేరని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కోల్పోయేలా వ్యాఖ్యలు చేశారని రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశారని తెలిపారు. జగన్ సర్కారుపై విశ్వాసం లేదని 5 కోట్ల ఆంధ్రులూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారని, మరి వారందరినీ కూడా అరెస్ట్ చేస్తారా? అని లోకేశ్ ప్రశ్నించారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టులు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించినా లెక్కచేయకుండా అరెస్ట్ చేశారని ఆరోపించారు.
వై కేటగిరీ భద్రతలో ఉంటూ, ఇటీవలే బైపాస్ చికిత్స పొందిన సొంత పార్టీ ఎంపీని ఆయన పుట్టినరోజు నాడే అరెస్ట్ చేయించడం జగన్ ఉన్మాదాన్ని వెల్లడిస్తోందని తెలిపారు. ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ (సీఐడీ) ఇప్పుడు సీఎం ఇండివిడ్యువల్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందని లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రశ్నిస్తే సీఐడీ అరెస్టులు, ఎదిరిస్తే ఏసీబీ దాడులు, వైసీపీలో చేరకపోతే జేసీబీతో ధ్వంసం, లొంగకపోతే పీసీబీ తనిఖీలు... ఇదీ నియంత సైకో జగన్ పాలన అని విమర్శించారు.