Black Fungus: శ్రీకాకుళం జిల్లాలో వెలుగుచూసిన బ్లాక్ ఫంగస్ కేసు.. నిర్ధారణ కాలేదన్న డీఎంహెచ్ఓ
- పలు రాష్ట్రాలను భయపెడుతున్న బ్లాక్ ఫంగస్
- నిజామాబాద్‌లో ఓ వ్యక్తి మృతి
- శ్రీకాకుళంలో బాధితుడి పరిస్థితి విషమం
కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశాన్ని ఇప్పుడు బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. మహారాష్ట్ర, యూపీ సహా పలు రాష్ట్రాల్లో బ్లాక్‌ఫంగస్‌కు సంబంధించిన కేసులు భయపెడుతున్నాయి. నిన్న తెలంగాణలోని భైంసాలో మూడు కేసులు వెలుగుచూశాయి. వీరిలో ఒకరు చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వీరిని హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తోంది. అలాగే, సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలోనూ మూడు కేసులు ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బ్లాక్ ఫంగస్ కేసు వెలుగుచూడడం కలకలం రేపుతోంది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ వ్యాధి బారినపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కరోనా బారినపడిన బాధిత వ్యక్తి గత నెల 14న దాని బారినుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే దవడపై వాపు కనిపించడంతో ఆసుపత్రిలో చేరాడు. ఇప్పుడతడి పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, అతడికి సోకింది బ్లాక్ ఫంగస్ అని ఇంకా నిర్ధారణ కాలేదని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రనాయక్ తెలిపారు.