Ayyanna Patrudu: ఏపీలో నెలకొన్న రాజ్యాంగ అస్థిర చర్యలపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి: అయ్యన్న
- రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై స్పందించిన అయ్యన్న
- రఘరామ వ్యాఖ్యల్లో తప్పేమీలేదని వెల్లడి
- కీలక వ్యవస్థలు సీఎం చేతిలో కీలుబొమ్మల్లా మారాయని విమర్శలు
- ఎవరు చెప్పినా సీఎం వినిపించుకునే స్థితిలో లేరని వ్యాఖ్యలు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్, తదనంతర పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఏపీలో నెలకొన్న రాజ్యాంగ అస్థిర చర్యలపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్, సీఐడీ, ఏసీబీ వ్యవస్థలు సీఎం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని ఆరోపించారు. కోర్టులు, గవర్నర్ చెప్పినా వినే స్థితిలో సీఎం లేరని అయ్యన్న విమర్శించారు. ఓ ఎంపీని అరెస్ట్ చేసేముందు లోక్ సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి అనుమతి తీసుకోవాలి కదా? అని ప్రశ్నించారు.
అయినా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యల్లో తప్పేముందని అన్నారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించడం తప్పెలా అవుతుందని నిలదీశారు. గతంలో చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు చేసినప్పుడు సీఐడీకి వినిపించలేదా? అని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామపై అధికార పార్టీ సోషల్ మీడియా ఖాతాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టించింది సజ్జల కాదా? అని ప్రశ్నించారు.