Chandrababu: రఘురామకృష్ణరాజును సీఐడీ ఆఫీసులో ఆటవిక రీతిలో హింసించారు: చంద్రబాబు
- సీఐడీ కోర్టులో రఘురామ హాజరు
- రఘురామ కాళ్లకు గాయాలు
- తీవ్రంగా స్పందించిన చంద్రబాబు
- ప్రశ్నించడమే నేరమా అంటూ ఆగ్రహం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రెండు కాళ్లకు గాయాలైన స్థితిలో కోర్టుకు హాజరవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. రఘురామకృష్ణరాజును అన్యాయంగా అరెస్ట్ చేయడమే కాకుండా, ఏపీ సీఐడీ కార్యాలయంలో ఆటవిక రీతిలో హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ నేరస్తుడైన ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుంటే ప్రశ్నించడమే రఘురామ చేసిన నేరమా? అని చంద్రబాబు నిలదీశారు.
పట్టపగలు ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంపై ఉన్న నమ్మకాన్ని ఇప్పుడు ప్రశ్నార్థకంగా మార్చారని వ్యాఖ్యానించారు. అయితే, రాజ్యాంగం, న్యాయవ్యవస్థ ధర్మాన్ని నిలబెడతాయని తాను విశ్వసిస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. ప్రజాస్వామ్య భద్రత, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అధర్మం ఎక్కడున్నా, అది ప్రతిచోట ధర్మానికి ముప్పుగానే పరిణమిస్తుందని చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.