Nara Lokesh: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ డిజిటల్ మూల్యాంకనంపై సీఎం జగన్ కు లేఖ రాసిన నారా లోకేశ్
- గ్రూప్-1 అభ్యర్థుల్లో సందేహాలున్నాయన్న లోకేశ్
- మూల్యాంకనం మాన్యువల్ పద్ధతిలో చేయాలని డిమాండ్
- డిజిటల్ పద్ధతి విమర్శలకు తావిస్తోందని వెల్లడి
- సీఎం జగన్ కు 5 డిమాండ్లతో లేఖ
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల డిజిటల్ మూల్యాంకనంపై అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మూల్యాంకనం సరిగా జరగలేదంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. ఎంపిక విధానం గతంలో పాటించిన ప్రక్రియకు విరుద్ధంగా ఉందని, ఎలాంటి అధ్యయనం లేకుండా డిజిటల్ మూల్యాంకనం విధానాన్ని ఎంచుకోవడం అనేక విమర్శలకు తావిస్తోందని విమర్శించారు.
మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకనం చేయడం కోసం రూపొందించిన జవాబు పత్రాలను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేయడం వల్ల అర్హులైన వారు నష్టపోయే ప్రమాదం ఉందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో ఇంటర్వ్యూలు ఉన్నందున ఈ 5 డిమాండ్లను సీఎం జగన్ పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.
1. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకనం చేయాలి.
2. ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లతో పాటు, అందరి అభ్యర్థుల మార్కులను వెల్లడించాలి. తద్వారా వారు తదుపరి ఉద్యోగ ప్రయత్నంలో లోపాలను సరిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది.
3. డిజిటల్ మూల్యాంకనానికి సంబంధించిన సాంకేతికత ఎస్ఓపీపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి.
4. ఎంపిక చేయని అభ్యర్థులందరి మార్కులు, వారి జవాబు పత్రాలను కూడా వెల్లడి చేయాలి.
5. సెలక్షన్ ప్రాసెస్, మూల్యాంకనంపై అనుమానాలున్న వారి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఆన్ లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
కొవిడ్ సాకుతో గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో నిర్మాణాత్మక, విధానపరమైన, చట్టపరమైన పద్ధతులను విస్మరించడం తగదని లోకేశ్ హితవు పలికారు. ముందుగా ఎలాంటి సన్నాహాలు లేకుండా అమలు చేసిన డిజిటలైజేషన్ విధానం అభ్యర్థులకు శాపం కాకూడదని స్పష్టం చేశారు.