AAG: భోజనం తీసుకువచ్చేవరకు బాగానే ఉన్నారు... ఆ తర్వాత కొత్త నాటకానికి తెరదీశారు: రఘురామపై ఏఏజీ వ్యాఖ్యలు
- హైకోర్టులో రఘురామ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
- సీఐడీ కోర్టులో రఘురామ హాజరు
- ఏ1 నిందితుడిగా నరసాపురం ఎంపీ
- రఘురామ గాయాలపై రేపు నివేదిక
- తీవ్ర ఆరోపణలు చేసిన ఏఏజీ
గుంటూరు సీఐడీ కోర్టులో రఘురామకృష్ణరాజును ఏ1 నిందితుడిగా ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తికి అందజేశారు. ప్రొసీడింగ్స్ పై అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి వివరాలు తెలిపారు. రఘురామకృష్ణరాజును పోలీసులు కొట్టారనడం ఓ కల్పితగాథ అని పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజుకు కుటుంబ సభ్యులు మధ్యాహ్న భోజనం తీసుకువచ్చారని, అప్పటివరకు బాగానే ఉన్న ఆయన, ఆ తర్వాత కొత్త నాటకం షురూ చేశారని సుధాకర్ రెడ్డి ఆరోపించారు.
హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో కొత్త ఆరోపణలు చేస్తున్నారని, కోర్టును తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. రఘురామ గాయాలపై రేపు మధ్యాహ్నం నివేదిక వస్తుందని తెలిపారు. కోర్టు నియమించిన మెడికల్ కమిటీ ఆ నివేదిక రూపొందిస్తుందని వెల్లడించారు.