Andhra Pradesh: ఏపీలో పాజిటివిటీ రేటు పెరగడంపై కేంద్రమంత్రి ఆందోళన

Positivity Rate in AP is High says Harsh Vardhan
  • ఏపీలో వారం వృద్ధిరేటు అత్యధికంగా 30 శాతం 
  • విశాఖపట్టణం, శ్రీకాకుళం సహా పలు జిల్లాల్లో పరిస్థితులు దారుణం
  • ఇప్పటి వరకు 18 కోట్ల డోసులు అందించామన్న కేంద్రమంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివిటీ రేటు ఆందోళనకరంగా పెరిగిపోతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ అన్నారు. కరోనా కేసులు తీవ్రస్థాయిలో ఉన్న ఏపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని కొవిడ్ పరిస్థితులపై మంత్రి నిన్న వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో వారం వృద్ధిరేటు అత్యధికంగా 30 శాతం ఉందని పేర్కొన్నారు. విశాఖపట్టణం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు.

జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం డైరెక్టర్ సుజీత్ కె.సింగ్ మాట్లాడుతూ.. సమీప గ్రామాల నుంచి కొవిడ్ రోగులను పట్టణాలకు తరలించే అవకాశం ఉండడంతో పట్టణాల్లోని ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచాలని సూచించారు. ఇప్పటి వరకు 18 కోట్ల డోసుల టీకాలను ప్రజలకు అందించామని, జులై చివరి నాటికి మరో 33.6 కోట్ల డోసులు అందిస్తామన్నారు.

స్పుత్నిక్ వ్యాక్సిన్‌కు ఇప్పటికే అనుమతి ఇచ్చామని, ఆగస్టు-డిసెంబరు మధ్య మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. జైడస్ క్యాడిలా, సీరం ఇనిస్టిట్యూట్ నోవావ్యాక్స్, భారత్ బయోటెక్ నుంచి నాసల్ వ్యాక్సిన్, జెనోవా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు అన్నీ కలిపి దాదాపు 216 కోట్ల డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్ ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల వైద్యఆరోగ్యశాఖ మంత్రులు పేర్కొన్నారు.
Andhra Pradesh
Positivity Rate
Corona Virus
Harsh Vardhan

More Telugu News