New Delhi: స్టేడియంలో టీకాలు వేయండి.. ఢిల్లీ సర్కార్ కు డీడీసీఏ లేఖ
- రోజూ 10 వేల మందికి ఇవ్వొచ్చని వెల్లడి
- సాధారణ పరిస్థితులు వచ్చే వరకు వాడుకోవచ్చని హామీ
- ఇప్పటిదాకా 41.64 లక్షల డోసులు వేసిన ఢిల్లీ
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియాన్ని కరోనా వ్యాక్సినేషన్ కోసం వినియోగించుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఢిల్లీ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) లేఖ రాసింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ధ్రువీకరించారు. స్టేడియంలో రోజూ 10 వేల మందికి వ్యాక్సిన్లు వేయొచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ను త్వరితగతిన చేయడం కోసం ఢిల్లీ సర్కార్ కు లేఖ రాశానని ఆయన చెప్పారు. మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చే వరకు స్టేడియాన్ని వాడుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం 45 ఏళ్లకు పైబడిన వారికి 470 కేంద్రాలు, 18–44 ఏళ్ల వారికి 394 కేంద్రాల్లో వ్యాక్సిన్లు వేస్తున్నారు.
ఇప్పటిదాకా 41.64 లక్షల డోసుల వ్యాక్సిన్లు లబ్ధిదారులకు ఇచ్చారు. 45 ఏళ్ల వారి కోసం 43 లక్షల డోసులు, 18–44 ఏళ్ల వారి కోసం 8.17 లక్షల డోసుల వ్యాక్సిన్ ను ఢిల్లీకి కేంద్రం అందజేసింది.