COVID19: వ్యాక్సిన్​ వేసుకున్నాక కరోనాతో ఆసుపత్రి పాలయ్యే ముప్పు 0.06 శాతమే!

Chances of hospitalisation after vaccination is minimal says apollo study
  • మహమ్మారి నుంచి 97.38% రక్షణ
  • అపోలో ఆసుపత్రి అధ్యయనంలో వెల్లడి
  • టీకా తీసుకున్న 3,235 మంది ఆరోగ్య సిబ్బందిపై స్టడీ
  • 85 మందికే కరోనా సోకినట్టు నిర్ధారణ
వ్యాక్సిన్ వేసుకున్న వారు ఆసుపత్రి పాలయ్యే ముప్పు చాలా వరకు తగ్గుతుందట. కరోనా టీకా తీసుకున్న వారిలో కేవలం 0.06 శాతం మందే ఆసుపత్రిలో చికిత్స తీసుకునే పరిస్థితులొచ్చాయని, 97.38 శాతం మంది వ్యాక్సిన్ తో కరోనా నుంచి రక్షణ పొందుతారని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ చేసిన అధ్యయనంలో తేలింది.

వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కరోనా మహమ్మారి సోకే ముప్పు (బ్రేక్ త్రూ కేసెస్)పై చేసిన అధ్యయన ఫలితాలను సంస్థ తాజాగా విడుదల చేసింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నాక తొలి వంద రోజుల్లో కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన ఆరోగ్య సిబ్బందిపై అధ్యయనం చేసినట్టు పేర్కొంది.

వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా అక్కడక్కడా కొన్ని కరోనా కేసులు వచ్చాయని, అయితే, అది అంత ప్రమాదకరమేమీ కాదని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అనుపమ్ సిబాల్ తెలిపారు. వ్యాక్సిన్లు వేసుకున్న వారిలో అతి తక్కువ కేసులు మాత్రమే వచ్చాయన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా సోకినా దాని వల్ల పెద్దగా ముప్పేమీ ఉండదన్నారు. ఐసీయూ లేదా ఆక్సిజన్ అవసరం రాదని, మరణాలూ ఉండవని చెప్పారు. కాబట్టి వ్యాక్సినేషన్ ను వీలైనంత వేగంగా చేస్తే మంచిదని ఆయన సూచించారు.

వ్యాక్సిన్ తీసుకున్న 3,235 మంది ఆరోగ్య సిబ్బందిపై ఈ స్టడీ చేశారు. అందులో కేవలం 85 మంది కరోనా బారిన పడినట్టు గుర్తించారు. కరోనా బారిన పడిన వారిలో 65 మంది రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇంకో 20 మంది ఒక డోసు తీసుకున్నారు. బాధితుల్లో ఎక్కువ మహిళలే ఉన్నారు.
COVID19
Covishield
Corona Vaccine
Apollo Hospitals

More Telugu News