Hyderabad: హైదరాబాద్ పై తౌతే ఎఫెక్ట్... పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- అరేబియా సముద్రంలో తౌతే తుపాను
- దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం
- హైదరాబాదులోనూ ఉరుములు, మెరుపులతో వర్షం
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్ఎంసీ
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌతే తుపాను ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపైనా పడింది. ఈ సాయంత్రం హైదరాబాదులోనూ భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మాదాపూర్, ఫిలింనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ప్రగతినగర్, బాచుపల్లి, నిజాంపేట్, దుండిగల్, కోఠి, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, అంబర్ పేట్, రామంతపూర్, మొయినాబాద్, రాజేంద్రనగర్, అత్తాపూర్, చిలుకూరు, ఉప్పల్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.
లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరడంతో జీహెచ్ఎంసీ మాన్సూన్ డిజాస్టర్ బృందాలను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.