Vaccination: మే నెలలో నెమ్మదించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం!
- తెలియజేస్తున్న ఆరోగ్య శాఖ గణాంకాలు
- మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్
- ఏప్రిల్‌లో సగటున రోజుకు 30 లక్షల టీకా డోసులు
- మేలో ఇప్పటి వరకు రోజువారీ సగటు 18.15 లక్షల డోసులు
- దాదాపు సగానికి పడిపోయిన రోజువారీ సగటు డోసులు
ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నెమ్మదించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు విశ్లేషిస్తే తెలుస్తోంది. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, చాలా రాష్ట్రాల్లో 18-44 ఏళ్ల కేటగిరీకి వ్యాక్సిన్లు ఇవ్వడం నిలిపివేశాయి. లేదా పాక్షికంగా కొనసాగిస్తున్నాయి. వ్యాక్సిన్ల కొరత వల్లే ఈ కేటగిరీ వారికి వ్యాక్సిన్లు ఇవ్వలేకపోతున్నామని పలు రాష్ట్రాలు ప్రకటించాయి.
ఏప్రిల్‌లో 8.98 కోట్ల డోసులు ప్రజలకు అందజేశారు. అంటే సగటున రోజుకు 30 లక్షల డోసులు అందించారు. కానీ మే నెలలో మాత్రం ఇప్పటి వరకు సగటున రోజుకి 18.15 లక్షల డోసులు మాత్రమే అందించారు. దాదాపు 47.74 శాతం తగ్గుదల కనిపించింది. ఈ నెలలో తొలి 15 రోజుల్లో ఇచ్చిన వ్యాక్సిన్ డోసులతో పోలిస్తే ఏప్రిల్‌లో దాదాపు రెట్టింపు సంఖ్యలో ప్రజలకు టీకా డోసులు అందజేశారు. ఇప్పటి వరకు ఏప్రిల్ 5న అత్యధికంగా 43 లక్షల మందికి టీకా అందించారు. ఇక మే 9న అత్యల్పంగా 6.89 లక్షల మందికి టీకా అందించారు.