Andhra Pradesh: బ్లాక్ఫంగస్తో హైదరాబాద్ ఆసుపత్రిలో మృతి చెందిన కడప వాసి
- ఏపీలో ఇప్పటి వరకు 12 బ్లాక్ ఫంగస్ కేసులు
- కరోనా నుంచి కోలుకున్న తర్వాత వ్యాధి బారినపడుతున్న వైనం
- స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతుండడమే కారణమంటున్న నిపుణులు
బ్లాక్ ఫంగస్ బారినపడిన కడప వ్యక్తి ఒకరు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా నుంచి కోలుకున్న వారు ఎక్కువగా దాని బారినపడుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ వ్యాధికి సంబంధించిన కేసులు తెలంగాణలోనూ నమోదయ్యాయి. ఏపీలోని శ్రీకాకుళంలో ఓ వ్యక్తిలో బ్లాక్ ఫంగస్ వ్యాధి లక్షణాలు కనిపించినప్పటికీ అధికారులు నిర్ధారించలేదు.
తాజాగా కడప జిల్లాకు చెందిన వంశీ అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్ బారినపడి కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు, ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ తరహా 12 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. కరోనా బాధితులు ఎక్కువగా ఐసీయూలో ఉండడం వల్ల, ఆక్సిజన్, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడడం వల్ల ఈ వ్యాధికి గురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.