High Court: తెలంగాణలో మాస్కులు లేని వారి నుంచి మొత్తం రూ.31 కోట్లు వసూలు చేశాం: డీజీపీ
- హైకోర్టుకు డీజీపీ నివేదిక
- బ్లాక్ మార్కెట్లో ఔషధాల అమ్మకాలపై 98 కేసులు
- మాస్కులు ధరించని వారిపై 3,39,412 కేసుల నమోదు
- భౌతిక దూరం పాటించనందుకు నమోదయిన మొత్తం కేసులు 22,560
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ రోజు విచారణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు హాజరయ్యారు. అలాగే, తెలంగాణలో లాక్డౌన్, కరోనా నిబంధనలపై డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు.
కరోనా నేపథ్యంలో కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బ్లాక్ మార్కెట్లో ఔషధాల అమ్మకాన్ని నిరోధిస్తున్నామని, ఇప్పటికి 98 కేసులు నమోదు చేశామని వివరించారు. లాక్డౌన్ పకడ్బందీ అమలుకు చర్యలు
తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ నెల 1 నుంచి 14 వరకు నిబంధనల ఉల్లంఘనల కింద మొత్తం 4,31,823 కేసులు నమోదు చేశామని చెప్పారు. మాస్కులు ధరించని వారిపై 3,39,412 కేసులు నమోదు చేశామని, మొత్తం రూ.31 కోట్ల జరిమానా వసూలు చేశామని చెప్పారు. అలాగే, భౌతిక దూరం పాటించనందుకు మొత్తం 22,560 కేసులు నమోదయ్యాయని వివరించారు.
కాగా, లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వృద్ధులు, పేదవారికి వ్యాక్సినేషన్ కోసం ఎన్జీవోలతో ఒప్పందం చేసుకుని డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ పెట్టాలని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉండి కరోనా బారిన పడిన టీచర్లను కరోనా వారియర్లుగా గుర్తించాలని హైకోర్టు చెప్పింది.