AEFI: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం వంటి ఘటనలు భారత్ లో చాలా తక్కువ: నిపుణుల కమిటీ

AEFI Committee submits report on post vaccination events

  • ఇతర దేశాల్లో అధికంగా నమోదైన ఘటనలు
  • భారత్ లో ఏఈఎఫ్ఐ కమిటీ నియామకం
  • లోతైన విశ్లేషణ జరపాలని ఆదేశం
  • నివేదిక సమర్పించిన కమిటీ

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే రక్తం గడ్డకట్టడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ తో చనిపోతారన్న అపోహలు నెలకొన్న నేపథ్యంలో, కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఆసక్తికర అంశాలు వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం వంటి ఘటనలు భారత్ లో అత్యంత తక్కువ అని అడ్వెర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ (ఏఈఎఫ్ఐ) కమిటీ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది.

ఈ ఏడాది మార్చి 11న కొన్ని దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (భారత్ లో కొవిషీల్డ్) ఇచ్చిన తర్వాత రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలు మూసుకుపోవడం వంటి ఘటనలు వెలుగుచూశాయి. దాంతో ఈ అంశంలో లోతైన విశ్లేషణ చేయాలంటూ కేంద్రం ఏఈఎఫ్ఐ కమిటీని ఆదేశించింది. వెంటనే రంగంలోకి దిగిన కమిటీ... దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ పై దృష్టి సారించింది.

ఏప్రిల్ 3 నాటికి 7,54,35,381 వ్యాక్సిన్ డోసులు ఇవ్వగా, 23 వేల మందిలో దుష్పరిణామాలు కనిపించాయని, అందులోనూ 700 కేసులు మాత్రమే తీవ్రమైనవని కమిటీ గుర్తించింది. దేశంలో 10 లక్షల వ్యాక్సిన్ డోసులకు గాను దుష్పరిణామాలు చవిచూసింది 0.61 కేసులు మాత్రమేనని తన నివేదికలో పేర్కొంది. అయితే ఇవన్నీ కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనే అని, కొవాగ్జిన్ తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడం వంటి ఘటనలు నమోదు కాలేదని వివరించింది.

కాగా, బ్రిటన్ లో ప్రతి 10 లక్షల డోసులకు 4 కేసుల్లోనూ, జర్మనీలో ప్రతి 10 లక్షల డోసులకు 10 కేసుల్లోనూ దుష్పరిణామాలు కనిపించాయని ఏఈఎఫ్ఐ కమిటీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News