Singapore: సింగపూర్ లో 'బి.1.617' స్ట్రెయిన్ కలకలం... పిల్లలకు అత్యధికంగా సోకుతున్న వైరస్
- భారత్ లో మొట్టమొదట వెలుగుచూసిన బి.1.617
- సింగపూర్ లోనూ ప్రత్యక్షం
- అత్యధికంగా పిల్లల్లో పాజిటివ్ కేసులు
- విద్యాసంస్థల మూసివేత
- ఆన్ లైన్ లో బోధన
చైనాలో పుట్టిన కరోనా రక్కసి, ఏడాదిన్నర కాలంలో అనేక రూపాలు దాల్చి ప్రపంచ మానవాళిని కకావికలం చేస్తోంది. సాధారణ చికిత్సకు లొంగని మొండిఘటంలా మారి ప్రాణాలు తీస్తోంది. అయితే, ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడిన వారిలో పిల్లల శాతం చాలా తక్కువ. కానీ, ఇప్పుడు మన దేశంలో విజృంభిస్తున్న తరహా స్ట్రెయిన్ (బి.1.617) తాజాగా సింగపూర్ లో వెలుగుచూసే, తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
దీని ప్రభావంతో చిన్నారులు అత్యధిక సంఖ్యలో పాజిటివ్ గా నిర్ధారణ అవుతున్నారు. దాంతో బుధవారం నుంచి సింగపూర్ లో విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మే 28తో విద్యాసంవత్సరం పూర్తి కానుండగా, అప్పటివరకు ఆన్ లైన్ బోధన కొనసాగనుందని అధికారవర్గాలు వెల్లడించాయి.
కొన్నినెలలుగా సింగపూర్ లో కొత్త కేసులేమీ లేవు. అయితే, తాజాగా మళ్లీ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండడం ఇక్కడి అధికార వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో, కొవిడ్ ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నారు.
దీనిపై సింగపూర్ ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యే కుంగ్ మాట్లాడుతూ, బి.1.617 స్ట్రెయిన్ పిల్లలపై అత్యధిక ప్రభావం చూపిస్తోందని అన్నారు. జన్యు ఉత్పరివర్తనాలకు లోనైన ఈ వేరియంట్లు చిన్నారుల మధ్య వేగంగా పాకిపోతున్నాయని విద్యాశాఖ మంత్రి చాన్ గున్ సింగ్ వెల్లడించారు. బి.1.617 కరోనా వేరియంట్ ను భారత్ లోనే తొలిసారిగా గుర్తించడం జరిగింది.