Tauktae: తౌతే ఎఫెక్ట్‌.. 410 మంది సిబ్బందితో కొట్టుకుపోయిన భారీ నౌకలు

two heavy Barges drifted into sea as its anchors went off due to heavy tides of tauktae

  • పెను తుపానుగా మారిన తౌతే
  • మరికొద్ది సేపట్లో గుజరాత్‌లో తీరాన్ని తాకనున్న తుపాను
  • ముంబయి వద్ద సముద్రం అల్లకల్లోలం
  • యాంకర్‌లు తెగిపోయి కొట్టుకుపోయిన బార్జ్‌లు
  • సహాయక చర్యలకు రంగంలోకి దిగిన నేవీ

పెను తుపానుగా మారిన తౌతే గుజరాత్‌ దిశగా వేగంగా పయనిస్తోంది. ఈ క్రమంలో ముంబయి తీరాన్ని అతలాకుతలం చేసింది. మహానగరాన్ని కుండపోత వర్షాలతో ముంచెత్తింది. ముంబయి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారడంతో రెండు భారీ నౌకల(బార్జ్‌లు) యాంకర్లు తెగిపోయాయి. వీటిలో ఒకటి హీరా ఆయిల్‌ ఫీల్డ్స్‌కు చెందిన ‘పీ305’లో 273 మంది ఉండగా.. మరొకటి జీఏఎల్‌ కన్‌స్ట్రక్టర్‌లో 137 మంది ఉన్నారు. అలల ధాటికి ఈ నౌకలు సముద్రంలోకి కొట్టుకుపోతున్నాయి.

వెంటనే అప్రమత్తమైన భారత నావికాదళం సహాయక చర్యలను ప్రారంభించింది. ఆయా నౌకల నుంచి వచ్చిన అత్యవసర సందేశాల మేరకు ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ కొచ్చిని రంగంలోకి దింపారు.

ప్రస్తుతం ముంబయికి 150కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తౌతే.. పశ్చిమ వాయవ్య దిశగా వేగంగా పయనిస్తోంది. త్వరలోనే గుజరాత్‌ తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఇప్పటికే గుజరాత్‌లోని 17 జిల్లాల్లో లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం 54 ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. త్రివిధ దళాలు సైతం అత్యవసర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News