Tauktae: బీభత్సం సృష్టించిన తౌతే.. విరుచుకుపడిన భారీ వర్షాలు.. 14 మంది కన్నుమూత
- కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లపై తీవ్ర ప్రభావం చూపిన తుపాను
- కర్ణాటకలో 8 మంది మృతి
- ముగ్గురు నావికులు గల్లంతు
- ప్రచండ వేగంతో వీచిన గాలులు
- 55 విమాన సర్వీసులను రద్దు చేసిన ముంబై విమానాశ్రయం
కేరళ, కర్ణాటక, మహారాష్ట్రపై విరుచుకుపడిన తౌతే తుపాను నిన్న పొద్దుపోయాక గుజరాత్ వద్ద తీరం దాటింది. వెళ్తూవెళ్తూ 14 మందిని బలితీసుకుంది. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు చనిపోయారు. రెండు పడవలు నీట మునగడంతో ముగ్గురు నావికులు గల్లంతయ్యారు. అలాగే, కర్ణాటకలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
అరేబియా సముద్రంలో నిలిపి ఉంచిన రెండు నౌకల లంగర్లు తెగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సహాయక సిబ్బంది వాటిలో ఉన్న 410 మందిని రక్షించారు. తుపాను నేపథ్యంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలను నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిలిపివేశారు. మొత్తం 55 విమాన సర్వీసులను రద్దు చేశారు.
గుజరాత్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా రెండు లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను ముంబై సమీపానికి వచ్చినప్పుడు గంటకు 114 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. తుపాను ఉద్ధృతికి ముందే రెండు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢిల్లీకి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మహారాష్ట్ర, గుజరాత్, గోవా ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ తుపానుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. తుపాను ప్రభావానికి గురైన గుజరాత్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుపాను కారణంగా ముంబై విమానాశ్రయాన్ని మూసివేయడంతో అక్కడ దిగాల్సిన రెండు విమానాలను దారి మళ్లించి శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.