Ramagundam: రామగుండం ఎరువుల కర్మాగారంలో అరగంటపాటు అమ్మోనియా గ్యాస్ లీక్.. ఉక్కిరిబిక్కిరైన ప్రజలు
- నిన్న తెల్లవారుజామున లీకైన అమ్మోనియం గ్యాస్
- శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడిన జనం
- ప్రిల్లింగ్ యూనిట్ నుంచే లీకైందని అనుమానం
తెలంగాణలోని రామగుండంలోనున్న ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్‌సీఎల్)లో నిన్న తెల్లవారుజామున అమ్మోనియా గ్యాస్ లీకైంది. అరగంట పాటు గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్యాస్ లీకేజీతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వీరపల్లి, లక్ష్మీపురం, ఎల్కలపల్లి, పెంచికల్‌పేట ప్రాంతాల్లో లీకేజీ మరింత ఎక్కువగా ఉండగా, తిలక్‌నగర్, విఠల్ నగర్, అడ్డగుంటపల్లి, ఇందిరానగర్, గౌతమి నగర్, గోదావరి ఖని, కల్యాణ్‌నగర్ తదితర ప్రాంతాలకు గ్యాస్ వ్యాపించింది. దీంతో ఏం జరుగుతోందో అర్థం కాక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
ఆర్ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తికి ప్రిల్లింగ్ యూనిట్, ప్రిల్లింగ్ టవర్ కీలకంగా వ్యవహరిస్తాయి. ఇక్కడ లిక్విడ్ అమ్మోనియాను శీతలీకరించి ఘనరూపంలో యూరియాగా మార్చుతారు. గతంలోనూ ఈ యూనిట్ నుంచి అమ్మోనియా లీకైంది. తాజా లీకేజీ కూడా ఇక్కడి నుంచే జరిగి ఉంటుందన్న అనుమానం వ్యక్తమవుతోంది. మరోవైపు, ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న ప్రమాదకరమైన రసాయనాలను శుద్ధి చేయకుండా బయటకు విడుదల చేస్తుండడంతో సంజయ్‌నగర్ ఆక్సిడైజేషన్ పాండ్‌లోని చేపలు మృత్యువాత పడుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.