INS: అతిక్లిష్టమైన వాతావరణంలో నేవీ సహాయ చర్యలు.. 177 మంది సురక్షితం
- వెల్లడించిన నౌకాదళ అధికారి
- ఓఎన్జీసీ పీ305లోని సిబ్బంది రెస్క్యూ
- 410 మందితో కొట్టుకుపోయిన రెండు నౌకలు
- మిగతా వారి కోసం కొనసాగుతున్న సహాయ చర్యలు
- రంగంలోకి నేవీ హెలికాప్టర్లు
ముంబై తీరంలో కొట్టుకుపోయిన రెండు నౌకల్లోని సిబ్బందిని కాపాడేందుకు సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఓఎన్జీసీకి చెందిన బార్జ్ పీ305 అనే నౌక, గాల్ కన్ స్ట్రక్టర్ అనే మరో నౌక కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. 410 మంది సిబ్బంది ఆ రెండు నౌకల్లో ఉన్నారు. వెంటనే భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ కోల్ కతా, ఐఎన్ఎస్ కొచి, ఐఎన్ఎస్ తల్వార్ లు సహాయ చర్యల్లోకి దిగాయి.
సోమవారం రాత్రంతా అతిక్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో 177 మందిని కాపాడామని నౌకాదళ అధికారి ఒకరు చెప్పారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ)కి చెందిన బార్జ్ పీ305లో 273 మంది ఉన్నారని చెప్పారు. ఐఎన్ఎస్ కొచ్చి, ఓఎస్వీ ఎనర్జీ స్టార్ సంయుక్తంగా నిర్వహించిన సహాయ చర్యల్లో మొదటగా సోమవారం రాత్రి 11 గంటలకు 60 మందిని పీ305 నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు.
ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచే తౌతే తుపాను గుజరాత్ తీరాన్ని తాకే సమయంలోనే ఐఎన్ఎస్ కోల్ కతా, గ్రేట్ షిప్ అహల్య, ఓఎస్వీ ఓషన్ ఎనర్జీలూ సహాయ చర్యల్లో భాగమయ్యాయని వివరించారు. ఈ రోజు ఉదయం నాటికి మొత్తంగా 177 మందిని కాపాడామని చెప్పారు.
మిగతా వారినీ కాపాడేందుకు ఈ రోజు కూడా సహాయ చర్యలు కొనసాగుతాయన్నారు. మరో నౌక గాల్ కన్ స్ట్రక్టర్ లో ని 137 మందినీ కాపాడుతామని చెప్పారు. ఈ రోజు రెస్క్యూ కోసం హెలికాప్టర్లను వినియోగిస్తామని తెలిపారు. ఐఎన్ఎస్ శిఖర నుంచి ఇప్పటికే హెలికాప్టర్లను పంపించారు.