Uttar Pradesh: ఒక రోజు వ్యవధిలో కరోనాకు కవలల బలి!
- నెగెటివ్ వచ్చిన మూడ్రోజులకే మృత్యువాత
- పుట్టినరోజు మర్నాడే పాజిటివ్ అని నిర్ధారణ
- మే 1న ఆసుపత్రిలో చేర్చిన తల్లిదండ్రులు
వాళ్లిద్దరూ కవలలు. 3 నిమిషాల వ్యవధిలో ప్రపంచాన్ని చూశారు. ఇంజనీరింగ్ చదివి ప్రయోజకులూ అయ్యారు. ఆ సంతోషాన్ని కరోనా మహమ్మారి తీసుకెళ్లిపోయింది. దాని కాటుకు కలిసే ఆ ఇద్దరు కవలలు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది.
గ్రెగరీ రాఫెల్ దంపతులు మీరట్ లోని సెయింట్ థామస్ స్కూల్ లో టీచర్లు. వారికి ముగ్గురు మగ పిల్లలు. కవలలైన జోఫ్రెడ్ వర్గీస్ గ్రెగరీ, రాల్ ఫ్రెడ్ జార్జ్ గ్రెగరీలు చిన్నవారు. అయితే, ఆ ముగ్గురూ కరోనా బారిన పడ్డారు. ఏప్రిల్ 23న ఆ ఇద్దరు కవలలు 24వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ మర్నాడే వారికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారి అన్నకూ కరోనా సోకింది.
మే 1న ఆరోగ్యం క్షీణించిన ఆ ఇద్దరు కవలలను నగరంలోని ఆనంద్ ఆసుపత్రిలో చేర్చారు. మే 10న కరోనా పరీక్షలు చేస్తే నెగెటివ్ అని తేలింది. అయితే, మే 13న జోఫ్రెడ్ చనిపోయినట్టు ఆ కవలల తల్లిదండ్రులకు ఆసుపత్రి నుంచి ఫోన్ వెళ్లే సరికి నిశ్చేష్టులయ్యారు. అంతకుముందు రోజే ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతోందంటూ జోఫ్రెడ్ చెప్పాడు. అతడి పక్క బెడ్ పైనే ఉన్న రాల్ ఫ్రెడ్ కూడా పరిస్థితి విషమించి జోఫ్రెడ్ మరణించిన మర్నాడే చనిపోయాడు. ఊపిరితిత్తుల దాకా ఇన్ ఫెక్షన్ సోకడం వల్లే వారిద్దరూ మరణించారని వైద్యులు చెబుతున్నారు.