Vijayashanti: 'గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష'ను విజయవంతం చేయండి: విజయశాంతి
- సీఎం కేసీఆర్ పై విజయశాంతి ధ్వజం
- ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారని విమర్శలు
- 'ఆయుష్మాన్ భారత్' పథకంలో చేరకపోవడంపై ఆగ్రహం
- రాష్ట్రంలో కరోనా ఫీజులపై నియంత్రణలేదని వెల్లడి
తెలంగాణలో కరోనా చికిత్సను 'ఆరోగ్యశ్రీ' పరిధిలో చేర్చాలని బీజేపీ ఎప్పట్నించో పోరాడుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో 'ఆయుష్మాన్ భారత్' పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ రెండు డిమాండ్లతో 'గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష' పేరిట కమలనాథులు కార్యాచరణ ప్రకటించారు. ఈ క్రమంలో రేపు దీక్ష చేపట్టనున్నారు. దీనిపై బీజేపీ మహిళా నేత విజయశాంతి స్పందించారు.
'గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష'ను విజయవంతం చేయాలని అన్నారు. తెలంగాణలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని విమర్శించారు. 'ఆయుష్మాన్ భారత్' పథకంలో తెలంగాణ రాష్ట్రం చేరకపోవడం వల్ల ప్రభుత్వానికి రూ.200 కోట్ల నష్టం అని, తెలంగాణలోనూ 'ఆయుష్మాన్ భారత్' అమలు చేసి ఉంటే కరోనా చికిత్సలో రూ.5 లక్షల వరకు కేంద్రమే చెల్లించేదని విజయశాంతి వివరించారు. తన చుట్టాలు, అనుచరులకు చెందిన ఆసుపత్రులకు వచ్చే ఆదాయాన్ని కాపాడేందుకే 'ఆయుష్మాన్ భారత్', 'ఆరోగ్యశ్రీ' పథకాలను పట్టించుకోవడం లేదా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ఫీజులపై నియంత్రణ కొరవడిందని, ఆసుపత్రుల బిల్లులు చెల్లించలేక ప్రజలు అల్లాడుతుంటే కేసీఆర్ దొరకు ప్రజల ఆర్తనాదాలు వినిపించడం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.